Tension in Burgul : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల్‌లో ఉద్రిక్తత తలెత్తింది. భాజపా యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో.. వివాదం చెలరేగింది. భాజపా జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి గురువారం రోజు యాత్ర ప్రారంభించగా.. అదే రోజు రాత్రి గ్రామంలో భాజపా జెండా గద్దె కూల్చివేయడంతో వివాదం నెలకొంది. ఈరోజు ఇదే గ్రామం నుంచి వివేక్ యాత్ర రెండోరోజు ప్రారంభం కానుండటంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
రెండో రోజు యాత్ర ప్రారంభించడానికి బూర్గుల్‌కు పయనమైన భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తుంకిపల్లి వద్ద కాషాయ నేతలు వివేక్, అరుణతారను అడ్డుకుని గ్రామంలోకి వెళ్లడానికి నిరాకరించారు. రహదారిపై బైఠాయించి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో అరుణతార చేతికి గాయమైంది. ఈ మొత్తం వ్యవహారంతో మనస్తాపం చెందిన ఆమె పోలీసుల కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనంతరం అరుణతార, వివేక్ వెంకటస్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు కార్యకర్తలు, నాయకులు పోలీసులను తప్పించుకుని వెళ్లి బూర్గుల్‌లో భాజపా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అరెస్ట్ చేసిన నాయకులను పోలీసులు విడిచి పెట్టడంతో వివాదం సద్దుమణిగింది. వివేక్ రెండో రోజు యాత్ర కొనసాగింది.
ఇదీ చదవండి : ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: మోదీ