ప్రతిపక్షాలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని భాజపా రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ విమర్శించారు. అన్నదాతలను వ్యాపారులుగా మార్చడానికే.. కేంద్రం నూతన చట్టాలను రూపొందించిందని వివరించారు. గురువారం కామరెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
దిల్లీలో జరుగుతోన్న ఆందోళనలో పంజాబ్, హరియాణా వారు తప్ప ఇతర రాష్ట్రాల రైతులు లేరని జయశ్రీ ఆరోపించారు. అన్నదాతలంతా చట్టాలకు అనుకూలంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు పంటను తమకు నచ్చిన ధరకే ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛను ఈ చట్టం కల్పిస్తోందన్నారు. మార్కెట్ యార్డులను తొలగించడం లేదని స్పష్టం చేశారు.
దేశ జనాభాలో 55 శాతం మంది.. ఈ చట్టాలు రైతులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని విశ్వసిస్తోన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ చట్టానికి మద్దతివ్వాలని కోరారు. ఊహాగానాలను వదిలేసి.. రైతులకు మేలు చేసే ఈ చట్టాలను అర్థం చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై రైతు పోరాటం మరింత ఉద్ధృతం