కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటికే వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు 21,788 ఉన్నాయి. ఇవే కాకుండా 75 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలకు కూడా కార్డులు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటికే 27,483 మందికి జారీ చేశారు.
అర్హులకే అవకాశం
ఉపాధి పనులకు ఈ ఏడాది చాలా మంది ఆసక్తి చూపారు. కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో నాలుగు నెలల పాటు ప్రథమ స్థానంలో కొనసాగింది. కరోనా నేపథ్యంలో చాలా మంది పేదలు, మధ్య తరగతి వర్గాలు ఉపాధి పనులకు వచ్చారు. వలస కార్మికులు సైతం స్వగ్రామాలకు చేరుకొని ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పనిదినాలు ఎక్కువ పూర్తి చేసుకున్నవారికి కొత్త జాబ్‌కార్డులు జారీ చేయాలని సూచించింది.
అధికారులు మండలాల వారీగా జాబ్‌కార్డులను పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తున్నారు. ఒక జాబ్ కార్డులో తల్లిదండ్రులతో పాటు కుమారుడు, కోడలు ఉంటే పాత కార్డును కుమారుడు, కోడలుకు కేటాయించి తల్లిదండ్రులకు కొత్త కార్డు జారీ చేస్తారు. ఒకవేళ తల్లిదండ్రులతో పాటు వివాహం కాని కుమారుడు ఉంటే పాత కార్డు ఆయనకు ఇచ్చి కొత్త కార్డును తల్లిదండ్రులకు ఇస్తారు. కార్డులో కేవలం దంపతులు మాత్రమే ఉంటే కొత్త కార్డు ఇవ్వడం సాధ్యపడదు.
కొనసాగుతున్న పరిశీలన
కొత్త జాబ్‌కార్డుల జారీకి మండలాల్లో పరిశీలన కొనసాగుతోంది. ఎంపీడీవోలు, ఏపీవోలు వివరాలు ఆరా తీస్తున్నారు. అర్హుల జాబితాలను తయారు చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగడం వల్ల కూలీలకు ఉపాధి దొరుకుతుంది. డిసెంబరు, జనవరి నుంచి వ్యవసాయ పనులు తగ్గుముఖం పడుతాయి. అప్పుడు ఉపాధి పనులకు డిమాండు ఏర్పడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జున్ వరకు పనులకు డిమాండు అధికంగా ఉండే అవకాశం ఉంది. కార్డుల్లో దంపతులు మాత్రమే ఉంటే వారికి కొత్త కార్డులు జారీ చేయడానికి వీల్లేదనే నిబంధన వల్ల కొందరు ఉపాధికి దూరం కావాల్సిన పరిస్థితి.
అర్హులందరికి జారీ చేస్తాం
జిల్లాలో అర్హులందరికి కొత్త జాబ్ కార్డులు జారీ చేస్తాం. ఇప్పటికే అర్హుల జాబితా మండలాల వారీగా సేకరిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి కొత్త కార్డులు జారీ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పాం.
- చంద్రమోహన్‌రెడ్డి, డీఆర్డీవో కామారెడ్డి
ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం