కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండలం దామరంచ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు తరగతి గది నుంచి బయటకు వస్తూ ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. కొంతమంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ద్విచక్రవాహనాలపై ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అధికారుల నిర్లక్ష్యం
ఇటీవల 15 రోజుల క్రితం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల 50 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భోజన నిర్వహణపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు.
మళ్లీ పునరావృతం
తాజాగా ఇవాళ ప్రాథమిక పాఠశాలలో మరో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బీర్కూర్‌లో సంఘటనకు కారణమైన ప్రధానోపాధ్యాయులను ఇప్పటికే విధుల నుంచి తొలగించినా కూడా ఎలాంటి మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారుల ఆదేశాలను మధ్యాహ్న భోజన నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: