తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ 613 కిలోల గంటను తయారు చేయించి రామేశ్వరం నుంచి రామ జన్మభూమి అయోధ్యకు తీసుకెళ్తున్నారు. ఈనెల 17న ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా రామ రథయాత్ర పేరుతో రామేశ్వరం నుంచి గంటను తీసుకొని బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఐదో శక్తిపీఠం అయిన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ సన్నిధికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, పలువురు భాజపా నాయకులు, అలంపూర్ పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, ఈవో ప్రేమ్ కుమార్ మేళతాళాల మధ్య గంట ఉన్న వాహనాన్ని జోగులాంబ సన్నిధికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అయోధ్యకు తీసుకెళ్తున్న గంటకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణమంతా హోరెత్తింది. పవిత్రమైన రామ జన్మభూమికి తీసుకెళ్తున్న గంటను దర్శించుకోవటం ఆనందంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆనందంగా ఉంది..
అయోధ్యలో నిర్మితమవుతోన్న రామ మందిరానికి దక్షిణ భారతదేశం నుంచి 613 కిలోల గంటను తయారు చేయించి తీసుకెళ్తుండటం పూర్వజన్మ సుకృతమని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. తానే స్వయంగా వాహనాన్ని నడిపి 10 రాష్ట్రాల గుండా 4,552 కిలోమీటర్లు ప్రయాణించి.. వచ్చే నెల 7న అయోధ్యకు చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఇవీ చూడండి: 'అధిక ఆదాయం వచ్చే పంటలను పండిద్దాం'