Gas cylinder explosion in jogulamba gadwal district: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కిష్టమ్మ (74) అనే వృద్ధురాలు సజీవదహనం అయ్యింది. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలో ఉదయం 11 గంటల సమయంలో వంట చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.
ప్రమాదస్థలికి సమీపంలో ఉన్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారమందించారు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గుడిసెలో ఉన్న కురువ కిష్టమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న ఆమె భర్తకు గాయాలు అవడంతో గద్వాల్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్యాస్లీకేజీతో ప్రమాద ఘటనలు నిత్యం ఏదో చోట సంభవిస్తునే ఉంటాయి. గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాటి పట్ల ప్రాథమిక పరిజ్ఞానం అవసరం సిలిండర్‌లోని గ్యాస్ లీక్ అవుతూ గదిలో నిండిపోయినప్పుడు ఇంట్లో అగ్ని వెలిగించడం, కరెంట్ స్విచ్ఛ్‌లు వేయడం వల్ల ఉత్పన్నమయ్యే స్పార్క్(సూక్ష్మ నిప్పురవ్వ) ద్వారా ఒక్కసారిగా మంట చెలరేగుతుంది. ద్వారాలు లేకపోవడంతో గోడలు, వస్తువులను ధ్వంసం చేస్తుంది.
సిలిండర్ నుంచి గ్యాస్ లీకైనప్పుడు.. స్టవ్ వెలిగించగానే.. ఎక్కడి వరకు గ్యాస్ వ్యాపించిందో.. అక్కడి వరకు మంట వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతో సహజంగానే సిలిండర్ పేలిందని అనుకుంటాం. మంటలు తక్కువగా ఉన్నప్పుడు మన వద్ద ఉన్న నీళ్లతో ఆర్పేయొచ్చు. రాత్రి వేళ గ్యాస్ లీకేజీ అవకాశాలు లేకుండా రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ముఖ్యంగా సిలిండర్ ఉన్న వంట గదిలో రిఫ్రిజిరేటర్ ఉంచకూడదు. వోల్టేజీ హెచ్చు తగ్గులప్పుడు, స్విచ్ఛుల వద్ద చిన్న స్పార్క్ వచ్చినా గ్యాస్ లీకేజీ కారణంగా మంట పెద్దగా మారుతుంది.
ఇవీ చదవండి: