వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల ప్రారంభోత్సవానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద మాధవా నందస్వామి, కమలా నందభారతి స్వామిజీ పుష్కరాలను ప్రారంభించారు.
కొవిడ్ నిబంధనలు...
మంత్రులు తుంగభద్రా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నదిలో ప్రమాదాల బారిన పడకుండా బోట్లను అందుబాటులో ఉంచారు. పుష్కరఘాట్లలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరమైతే ఆదుకునేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పుష్కరాలు నిర్వహించుకోవాలని మంత్రులు సూచించారు.
నాలుగు చోట్ల ఘాట్లు...
జోగులాంబ గద్వాల జిల్లాలో నాలుగు చోట్ల పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణిసోంపూర్‌లో పుష్కర ఘాట్లలో సౌకర్యాలు కల్పించారు. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపిస్తేనే భక్తులను ఘాట్లలోకి అనుమతిస్తారు. లేదంటే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నవారిని మాత్రమే పుష్కర ఘాట్లలోకి పంపిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్ ఒకటి వరకు జరగే తుంగభద్ర పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
పుణ్యఫలం...
పుష్కర స్నానమాచరించడం అంటే నీటి రుణాన్ని తీర్చుకోవడమని అర్థమని, తర్పణం చేయడం అంటే పూర్వీకులను గుర్తు చేసుకోవడమని పీఠాధిపతి కమలానంద భారతి అన్నారు. మానవజన్మను పరిపుష్టం చేసుకోవడం కోసం పూర్వీకులు, ఋషులు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు.
పురాణాలు, శాస్త్రాలు చెప్పిన ప్రకారం పుష్కరాలు జీవనదులకు మాత్రమే వస్తాయని, ఒక నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయని తెలిపారు. పుష్కరాల సమయంలో నదీస్నానం చేయడం వలన పుణ్యఫలం కలుగుతుందన్నారు. ప్రభుత్వం పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పుణ్యస్నానాలు ఆచరించాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: భాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్.. కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్