జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన(Minister Ktr visit in gadwal) ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి భూమిపూజ చేశారు. ఈ ఆస్పత్రిని రూ.21 కోట్లతో నిర్మించనున్నారు.
గద్వాల పర్యటనకు మంత్రి కేటీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులకు.. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు. పలువురు స్థానికులు సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రాలు అందజేశారు. అలంపూర్‌కు వెళ్లే దారిలో.. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను పలువురు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉండవల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శంకుస్థాపన అనంతరం.. మంత్రులు కేటీఆర్(Minister Ktr visit in gadwal), శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి.. అలంపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, భవనాలను ప్రారంభించారు.
నూతనంగా నిర్మించిన కస్తూర్భా విద్యాలయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రూ.31 లక్షలతో చేపట్టనున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రహరిగోడ నిర్మాణానికి మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
గద్వాల జిల్లా రేవులపల్లి వద్ద జూరాల పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఇరువైపులా 15వేల కోట్ల వ్యయంతో ఈ పార్కునిర్మాణం జరగనుంది. గద్వాలలో చెన్నకేశవ సంగాల పార్కును మంత్రి ప్రారంభించారు. కేటీఆర్ గద్వాల పర్యటనలో భాగంగా...పట్టణంలో 106 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గద్వాలలో కళాశాలలు, గ్రంథాలయాల భవనాలు, సీసీ రోడ్లు తదితర కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ మహిళా పీజీ కళాశాల, వసతి గృహంతోపాటు పట్టణంలో పూర్తయిన ఆర్వోబీని ప్రారంభిస్తారు. అనంతరం మార్కెట్ యార్డులోని బహిరంగ సభలో ప్రసగింస్తారు.