జోగులాంబ గద్వాల జిల్లాలో సుబాబుల్ పండించిన రైతుల పరిస్థితి.. అగమ్యగోచరంగా మారింది. కొన్నేళ్ల కిందట కాగితపు పరిశ్రమ కంపెనీల వారు.. రైతులతో మాట్లాడి స్వయంగా పంటను మేమే కొంటాము అని చెప్పి సాగు చేయించారు. ఎకరాకు 35 నుంచి 45 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. అప్పట్లో రేటు బాగా ఉండడంతో రైతులు గిట్టుబాటు అయ్యింది. రైతులు కూడా సాగు విస్తీర్ణం పెంచి అధికంగా పంటేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. కొనుగోలు కంపెనీలు రైతులకు మొండిచెయ్యి చూపి.. చుట్టుపక్కలకు రావడమే మానేశారు. మద్దతు ధర లేక రైతులు సుబాబుల్ సాగును ఆపేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 14 వేల ఎకరాల్లో సాగయ్యే పంట.. 5 వేల ఎకరాలకు తగ్గింది. పలువురు రైతులు చేసేదిలేక పంటను తొలగిస్తున్నారు.
జిల్లాలో ఎక్కువగా అయిజ, వడ్డేపల్లి, రాజోలి, ఉండవల్లి, మానవపాడు, ఇటిక్యాల, మల్దకల్, అలంపూర్ మండలాల్లో రైతులు సాగు చేశారు. గిట్టు బాటు ధర లేక ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటను తొలగించాలంటే.. వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉచితంగా పంటను తీసుకోమని చెప్పినా.. ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అప్పు తెచ్చి వేల ఎకరాల్లో పంట సాగు చేస్తే.. పెట్టుబడి రాకపోగా చివరకు పంట తొలగించడానికి మళ్లీ అప్పు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి సుబాబుల్ పంట సాగు చేస్తే.. ఆరేళ్ల వరకు చేతికి రాదు. ఇలా సంవత్సరాల తరబడి తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: