కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద చేపట్టే కార్యక్రమాల్లో ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి, సమాజ అభివృద్ధి వంటివి ఉంటాయని.. వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న శ్రీనివాసులు శెట్టి.. సోమవారం వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం పెద్దపొతులుపాడులో 'ఎస్బీఐ సంజీవని'ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎస్బీఐ ఫౌండేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు శెట్టి పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన భవిష్య భారత్ ట్రస్ట్ ఎస్బీఐ ఫౌండేషన్ 'ఎస్బీఐ సంజీవని'ని వివిధ మారుమూల ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి ఎస్బీఐ దేశంలోని వివిధ ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు స్పష్టం చేశారు.
నేను గద్వాల జిల్లా చిన్నపొతులుపాడులో జన్మించాను. పెద్దపొతులుపాడులో పెరిగాను. ఈ రెండు గ్రామాలూ నాకు ప్రియమైనవే. ఈ ఊరికి తిరిగి రావడానికి నాకు 35 సంవత్సరాలు పట్టింది. సీఎస్‌ఆర్ కార్యక్రమాల కింద ఎస్బీఐ ప్రతి సంవత్సరం సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్లు ఖర్చు పెడుతోంది. సీఎస్ఆర్లో భాగంగానే పెద్దపొతులుపాడులో 'ఎస్బీఐ సంజీవని'ని ప్రారంభించాం.
-చల్లా శ్రీనివాసులు శెట్టి, భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్
కట్టుబడి ఉన్నాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ సమాజంలోని సామాజిక-ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి వీలుగా సీఎస్‌ఆర్ కార్యక్రమాలను చేపడుతోందని హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ పేర్కొన్నారు. గద్వాల చింతల్‌పేట బాలుర కోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎస్‌ఆర్ కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వివిధ సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. మరో రూ.కోటి ఖర్చు చేయడానికి కట్టుబడి ఉన్నామని అమిత్ జింగ్రాన్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వరదలో చిక్కుకున్న గొర్రెల కాపరులు.. ప్రవాహం తగ్గేవరకు అక్కడే