Priyanka Gandhi Election Campaign in Gadwal : తెలంగాణ ప్రజలు ఏ కలల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నారో.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆ కలలు కల్లలుగానే మిగిలాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఆ కలలను సాకారం చేయడానికి చిత్త శుద్ధిగా కృషి చేస్తామని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయ భేరి బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
Congress Vijayabheri Public Meeting at Gadwal : ఈ సందర్భంగా తెలంగాణకు ఇప్పుడు అత్యంత కీలకమైన సమయం వచ్చిందని.. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక ప్రజలను కోరారు. బీఆర్ఎస్ నాయకులంతా ఫామ్‌హౌస్‌లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుతూ, ప్రజా సమస్యలను విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు అవినీతిమయమైపోయిందని, ఈ అవినీతి ద్వారా బీఆర్ఎస్ నాయకులు రోజురోజుకూ ధనవంతులుగా మారుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు : ప్రియాంక గాంధీ
విద్యార్థులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే.. ప్రశ్నాపత్రాలను లీక్ చేశారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియాలన్నీ రాష్ట్రంలో చెలరేగిపోయాయన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ధరణి ద్వారా భూములు లాక్కుంటున్నట్లు ఇళ్లు కూడా లాక్కుంటారని ఆరోపించారు. ఈ క్రమంలోనే గద్వాల పక్కనే ఉన్న కర్ణాటకలో.. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని ప్రియాంక గుర్తు చేశారు. అక్కడ హామీలుగా ఇచ్చిన 5 గ్యారెంటీలను అమలు పరుస్తున్నామని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయో కనుక్కోవాలని సూచించారు.
6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం : ప్రియాంక గాంధీ
ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంక్షేమం గురించి పట్టింపు ఉండదని ప్రియాంక పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్ల కోసం వచ్చి పోల్ మేనేజ్‌మెంట్ చేస్తారన్నారు. ఎన్నికలు వస్తే ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాలు చేస్తారు కానీ.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ స్పందించరని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని.. అంబేడ్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు అందజేయబోతున్నామన్నారు.
ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్ విధానం : ప్రియాంక గాంధీ
'మాల, మాదిగలు, ఎస్టీల కోసం ప్రత్యేకంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం ప్రతి కార్పొరేషన్‌లో ఏటా రూ.750 కోట్లు జమ చేస్తాం. దేశంలో బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ కేవలం అధికారంలో ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలి' అని ప్రియాంక గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్‌లో ఆ కుటుంబానికి సర్ప్రైజ్