జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నెకు చెందిన మహేందర్ తన భార్య జెనీలాను ఈనెల 24న కాన్పుకోసం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చాడు. జెనీలాకు రక్తం తక్కువగా ఉందని, బీపీ పెరిగినందున కర్నూల్‌కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. లాక్‌డౌన్ ఆంక్షలతో అక్కడికి వెళ్లేందుకు కుదరనందున తిరిగి అదే ఆసుపత్రికి వచ్చారు. తన భార్యాబిడ్డను ఎలాగైనా కాపాడాలంటూ.. వేడుకున్నాడు.
6 ఆసుపత్రులు.. 200 కి.మీ..
విషయం తెలుసుకున్న గద్వాల కలెక్టర్... వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. తీరా అక్కడికి వెళ్లాక.. అక్కడి సిబ్బంది హైదరాబాద్ కోఠి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడించి వైద్యులు గాంధీకి పంపారు. గాంధీలో గర్భిణీని పరీక్షించిన వైద్యులు.... తిరిగి పేట్లబురుజు ఆసుపత్రికి పంపారు. ఇలా... ఆ మహిళ ప్రసవ వేదనతో 200 కిలోమీటర్ల దూరం... 6 ఆసుపత్రులు తిరిగింది.
నిలోఫర్‌లో బిడ్డ మృతి..
చివరకు పేట్లబురుజులో జెనీలా శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులతో అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా.... బిడ్డ పుట్టడం ఆ వేదనను మరిపించింది. తమ ప్రతిరూపాన్ని చూసి మురిసిపోతున్న ఆ దంపతుల ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బాబు అనారోగ్యం పాలు కావడం వల్ల నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందతూ.. బిడ్డ మృతి చెందాడు.
ఆవిరైన ఆరాటం..
బిడ్డ చనిపోయాక... జెనీలా ఆర్యోగ పరిస్థితి సైతం విషమించగా... ఆమెను ఆదివారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ... సోమవారం రాత్రి జెనీలా ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులతో భార్య కాన్పు కోసం ఇంటి నుంచి బయలుదేరిన మహేందర్.... బిడ్డ, తల్లిని కాపాడుకునేందుకు పడిన పడిన ఆరాటం ఆవిరైపోయింది. కరోనా కలవరపెడుతున్న సమయంలోనూ... వైద్యులు సూచనలతో ఆస్పత్రులన్నీ తిరిగినా... తల్లిబిడ్డ ప్రాణాలు దక్కకపోవడం... వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కలిచివేసిన ఘటన..
నిండు గర్భిణీ కాన్పు కోసం ఐదారు ఆసుపత్రులు తిరగాల్సి రావడం.. అయినప్పటికీ తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు కోరుతున్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు