Midday Meal Bills Delay in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలో 288 ప్రాథమిక పాఠశాలలు, 88 ప్రాథమికోన్నత పాఠశాలలు, 85 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతోంది. సుమారు 72 వేల మంది విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. అన్ని పాఠశాలల్లోనూ కొత్త మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంది.. కానీ, అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
Mid Day Meals Bills Delay Telangana : మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు గుడ్లు, మిశ్రమ కూరగాయలతో కూర, కిచిడి, పప్పు, సాంబార్లతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాల్సి ఉంది. అయితే పెరిగిన కూరగాయల ధరల కారణంగా కొత్త మెనూ ప్రకారం వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజనాన్ని వండడం లేదు.. ముఖ్యంగా కోడిగుడ్ల ధర రూ.5 నుంచి రూ.7 వరకు పెరిగింది. టమాటా, మిర్చి సహా ఇతర కూరగాయల ధరలు కిలో రూ.40 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి.
అంత ధరలు పెట్టి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయలేమని వంట ఏజెన్సీ వారు వాపోతున్నారు. ఈ జిల్లాలో సుమారు నాలుగు నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. పాత మెనూ ప్రకారం వంట ఏజెన్సీ వారికి గౌరవ వేతనం రూ.1000 మాత్రమే ఇచ్చేది. కొత్త మెనూ ప్రకారం ప్రభుత్వం రూ.3000 గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన అవి వారికి అందడం లేదు.
New Menu Issue in Mid Day Meals Telangana : విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు అల్పాహారంగా రాగిజావని కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, అన్ని పాఠశాలలో రాగిజావ విద్యార్థులకు అందడం లేదు. గతంలో సకాలంలో బిల్లులు చెల్లించక చాలాచోట్ల వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజనం చేసేందుకు నిరాకరించాయి. పెరిగిన కూరగాయల ధరల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన బకాయిల విడుదలలో జాప్యం చేస్తే మరిన్ని ఏజెన్సీలు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి.
"కూరగాయల ధరలు బాగా పెరిగాయి. రూ.60 నుంచి 80 దాక పలుకుతున్నాయి. గవర్నమెంట్ నుంచి నిధులు మాకు రావడంలేదు. ధర ఎంత ఉన్నా సరే అన్ని పెట్టాల్సిందే అంటున్నారు. మాకు ఏం గిట్టుబాటు కావడంలేదు. వారంలో మూడు రోజులు గుడ్లు పెట్టాలి అంటున్నారు.. కానీ, గుడ్లు ధర చూస్తే రూ.7 దాక పలుకుతుంది. మాకు చూస్తే రూ.1000 ఇస్తున్నారు. అసలు ఆ డబ్బులు సరిపోవట్లేదు." - వంట నిర్వాహకురాలు, ప్రభుత్వ పాఠశాల
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపకార వేతనాలు పెంచడంతో పాటు.. బిల్లులు సకాలంలో చెల్లిస్తే తప్ప.. కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టే అవకాశం లేదు. అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది.
ఇవీ చదవండి: