Komaram bheem Asifabad Students Stuck in Ukraine : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసంలో భాగంగా ఉక్రెయిన్‌లో ఉన్నారు. ఊహించని రీతిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల్ని సురక్షితంగా.. వేగంగా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఉక్రెయిన్‌లో విద్యార్థుల అవస్థలు
చింతలమానేపల్లి మండలం లంబాడిహెట్టి (గుప్పగూడెం) గ్రామానికి చెందిన జటోత్ శ్యాంలాల్ కుమారుడు జాటోత్ సాయికిరణ్... రెబ్బెన మండలానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ రవి, స్వరూపల కుమారుడు గుండు హరిప్రసాద్‌లు ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఉక్రెయిన్- రష్యా మధ్యయుద్ధం జరుగుతున్న వేళ... సాయికిరణ్, హరిప్రసాద్‌లు అక్కడ చిక్కుకుపోవడంతో కుటుంబసభ్యుల్లో భయాందోళన మొదలైంది. పిల్లలతో తల్లిదండ్రులు ఫోన్‌లో మాట్లాడగా... తాము క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు. మిత్రులతో ఇండియా బయల్దేరుదామని వెళ్లగా మధ్యలో చిక్కుకుపోయామన్నారు.
త్వరగా తీసుకెళ్లండి..
ఇప్పటికైతే తమ ప్రాంతంలో బాంబుల దాడి జరుగలేదన్నారు. తాము ఉండే ప్రాంతంలో పెద్ద పవర్‌ప్లాంట్‌ఉందని... దానిపై దాడిచేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోందని పేర్కొన్నారు. దాడి జరిగితే రేడియేషన్ వల్ల ఆ ప్రాంతానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని... స్వదేశానికి వచ్చేలా వేగంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
'నేను ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాను. యుద్ధం ప్రభావం ఎక్కువగా తూర్పువైపు ఉంది. మేం పశ్చిమ వైపున ఉన్నాం. కానీ మా దగ్గర కూడా స్వల్ప ప్రభావం ఉంది. ఆహారం, వాటర్, డబ్బులకు ఇబ్బందులు తలెత్తున్నాయి. మా కోసం అమ్మానాన్నలు బాధపడుతున్నారు. రోజూ టెన్షన్ టెన్షన్‌గా ఉంటోంది. దయచేసి మమ్మల్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకెళ్లండి.'
-గుండు హరి ప్రసాద్, ఎంబీబీఎస్ విద్యార్థి
వివరాలు తెలియజేయండి..
జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల గురించి స్పెషల్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి వివరాలను తెలియజేయాలని ఎస్పీ సురేష్ కుమార్ వెల్లడించారు. కార్యాలయంలో సంప్రదించవలసిన నంబర్లు...
- ఫోన్ : 9550972074,
- వాట్సాప్ నంబర్ : 9100768200
నిర్మల్ జిల్లావాసి అలేఖ్య
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం దంపతుల కూతురు అలేఖ్య... ఉక్రెయిన్‌లోని ఒడేసా మెడికల్ కాలేజ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడే ఉంది. ప్రస్తుతం వారందరూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. చరవాణి సంకేతాలు అందడం లేదని... మార్చి 3న ఇక్కడికి రావాల్సి ఉండగా... విమానయాన సేవలు నిలిపివేయడంతో ప్రశ్నార్థకంగా మారిందిని తండ్రి ఆవేదన చెందుతున్నారు.
'నా కూతురు ఉక్రెయిన్‌లోని ఒడేసా మెడికల్ కాలేజీలో 2017 నుంచి చదువుతోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగా లేవు. వాళ్లను హాస్టల్ నుంచి బంకర్లలో ఉంచుతున్నారు. ఎంబసీ వాళ్లు... భారతీయులను రుమేనియా సరిహద్దులకు చేర్చాలి. అప్పుడే కాస్త టెన్షన్ తగ్గుతుంది. మాకు చాలా భయంగా ఉంది. పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం.'
-పురుషోత్తం, అలేఖ్య తండ్రి
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు