ఉమ్మడి పాలమూరు జిల్లా జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. మొన్నటి వరకు వరద నీటితో కళకళలాడిన ఈ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు లీకవుతున్నాయి. ఎలాంటి లీకేజీలు లేకుండా ప్రతి నాలుగేళ్లకు మార్చాల్సిన సీల్స్ మార్చకపోవడం వల్ల సుమారు 18 గేట్ల నుంచి లీకేజీలు కనిపిస్తున్నాయి. ఆరేళ్ల నుంచి రబ్బర్ సీల్స్ మార్చకపోవడం వల్ల 18 గేట్ల నుంచి తాజాగా లీకేజిలు కనిపిస్తున్నాయి. 38వ బ్లాక్ వద్ద క్రస్ట్ గేట్ల మరమ్మత్తుల కోసం వినియోగించే స్టాప్ లాక్ గేట్ సైతం జలాశయంలోనే ఉండిపోయింది. వాస్తవానికి మరమ్మత్తులు పూర్తికాగానే స్టాప్‌లాక్ గేట్‌ను జలాశయం బైటకు తీసుకు రావాలి. కానీ అలా చేయలేదు. కారణం ప్రాజెక్టుపై వినియోగించే క్రేన్ పనిచేయడం లేదు. వాహనం ఢీకొట్టడంతో గ్రాంటీ క్రేన్ చాలా ఏళ్లుగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఇవన్నీ తుప్పుపడుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టు క్రస్టు గేట్లు సైతం తుప్పుపడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించగా.. మరమ్మత్తులు చేపట్టాలని కమిటి సూచించింది. మరమ్మత్తుల కోసం ఏప్రిల్‌లో 10 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపారు. కానీ ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు.
మళ్లీ నిండితే ఎలా?
జూరాల ప్రాజెక్టు మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో క్రస్ట్ గేట్ల ఏర్పాటు జరిగింది. గేట్ల మరమ్మతులు, గేట్లు ఎత్తేందుకు అవసరమైన మోటార్ల నిర్వాహణ, ఇనుపతాళ్లకు గ్రీజింగ్, క్రస్ట్ గేట్లు తుప్పుపట్టకుండా ఇసుకతో శుభ్రపరచి రంగులు వేయడం ఇలాంటి వన్ని ఏటా జలాశయంలో నీళ్లు లేని సమయంలో అంటే వేసవి కాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కానీ మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే అది సాధ్యమవుతుంది. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు ఆగిపోతున్నాయి. మరోవైపు ప్రాజెక్టు నిండితే నీళ్లు ఎలా విడుదల చేసుకోవాలని ఆలోచిస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వాహణను మాత్రం పట్టించుకోవడం లేదు.
తాత్కాలిక చర్యలు సబబేనా?
క్రస్ట్ గేట్ల వద్ద స్వల్ఫంగా లీకేజీలు ఉన్నచోట ఇసుక బస్తాలు, ఎక్కువగా ఉన్న చోట్ల రబ్బర్ సీల్స్ అమర్చడం ద్వారా లీకేజీలును అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక నిధులు మంజూరైతే వచ్చే వేసవిలు మరమ్మతులు చేపడతామని చెబుతున్నారు. కానీ.. ఈ తాత్కాలిక చర్యలు ఎంతకాలం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జలాశయం పూర్తిగా నిండి ఉన్న కారణంగా మరమ్మత్తులు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే భారీ నష్టం తప్పదు.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్