కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో అంటువ్యాధులు ప్రబలితే.. మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు జోగులాంబ జిల్లా కలెక్టర్ శృతి ఓజా. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ 1 నుంచి జిల్లాలో అన్నీ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించనున్నట్టు, గ్రామీణ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు. జూన్ 1 నుంచి 8 వరకు గ్రామీణ స్థాయిలో జరిగే.. అభివృద్ధి, పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఆమె జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులకు పారిశుద్ధ్య కార్యక్రమం ఎలా విజయవంతం చేయాలో.. కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం పంచాయితీ సెక్రటరీలు, ఎంపీపీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు.
కరోనా వ్యాధిని నియంత్రించాలన్నా.. సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టాలంటే.. దోమలు లేకుండా చేయడం, పరిశుభ్రమైన నీళ్లు తాగడం, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రధానమని.. ప్రతి ఒక్కరు ఈ పనులు బాధ్యతగా చేయాలని సూచించారు. ఇంటిపైన, ఇంటి చుట్టుపక్కల ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. పాత కుండలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూసుకోవాలన్నారు. వీటిలో నీరు చేరి వారం రోజులు అలాగే ఉంటే.. డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. లాక్డౌన్లో వెసులుబాటు కల్పించినంత మాత్రన కరోనా వ్యాధి ముప్పు నుండి పూర్తిగా బయటపడినట్లు కాదని, సీజన్ లో వచ్చే ఏ చిన్న జబ్బు బారిన పడినా కరోనా అంటుకొని ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు