జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలోని పిల్లిగుండ్ల ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు.. అనుమతులు లేకుండానే మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో అర్హులైన పేదలకు కేటాయించిన స్థలాల్లో సైతం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటాచి వదిలేసి పరార్..
అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ భర్త చొరవతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం బయటికి పొక్కడంతో అక్రమార్కులు ఇటాచి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన మరో ముఖ్య నేత ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై భూగర్భ, గనుల శాఖ అధికారిని చరవాణి ద్వారా సంప్రదించగా.. అతడు స్పందించలేదని స్థానికులు తెలిపారు.
రోజూ లక్షల్లో..
టిప్పర్ ఒక టిప్పు మట్టిని రూ. 7 నుంచి 10 వేల వరకు విక్రయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో.. టిప్పర్లలో మట్టిని తరలించి రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: Cheating: అనాథనంటూ వల.. మూడో పెళ్లి చేసుకుని 6 లక్షలతో ఉడాయించిందిలా..!