జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి జలాశయం నుంచి 1,26,374 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఫలితంగా 94,340 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1705 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1699 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 101.03 టీఎంసీల నీటితో కళకళలాడుతోంది.
మరోవైపు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 79,285 క్యూసెక్కుల నీరు జూరాల జలాశయంలోకి చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 99,642 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1615 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1610.89 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తోన్న వరద.. జూరాల జలాశయానికి సాయంకాలం వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూరాల జలాశయానికి 13,500 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఫలితంగా 28749 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగివకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 316.940 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.629 టీఎంసీలుగా ఉంది.