ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. రెండు జలాశయాల నుంచి 3లక్షల 20వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 32 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 2లక్షల 97వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 18వేల 360 క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తోంది. కుడి, ఎడమ, సమాంతర కాల్వలు, కోయల్ సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల కొనసాగుతోంది.
జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా... ప్రస్తుతం 1039 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్ధ్యం 9.567 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.310 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వస్తుండటంతో అందుకు అనుగుణంగా జలాశయాన్ని ఖాళీ చేస్తున్నారు. మొత్తంగా జూరాల నుంచి ప్రస్తుతం 3లక్షల 17వేల క్యూసెక్కుల నీరు బైటకు వెళ్తోంది. మరోవైపు ఆల్మట్టి జలాశయానికి 2లక్షల 20వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3లక్షల 35వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటిమట్టం 1705 అడుగులు కాగా.. ప్రస్తుతం 1694 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 129 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ జలాశయానికి 2లక్షల 85వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 3లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా.. ప్రస్తుతం 1606 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 37టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 27టీఎంసీల నీటినిల్వ కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: జూరాలకు కొనసాగుతున్న వరద... 44గేట్లు ఎత్తివేత