అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠమైన సుప్రసిద్ధ క్షేత్రం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో ఏళ్ల నాటిగా ఓ వదంతు ప్రచారంలో ఉంది. అమ్మవారి ఆలయం కంటే ఎత్తుగా భవంతులు నిర్మిస్తే ఆ కుటుంబానికి అరిష్టమని... ఆర్థికంగా చితికిపోయి... ఊరు విడిచి వెళ్లిపోతారని ప్రజల్లో నాటుకుపోయింది. గతంలో జరిగిన పలు ఘటనల ఆధారంగా ఇప్పటికీ అక్కడ ఎత్తైన భవనాలు కట్టాలంటే స్థానికుల్లో ఒకింత భయం.
అసలు ఎందుకు భయపడుతున్నారు
జోగులాంబ ఆలయం 13వ శతాబ్దంలో ధ్వంసమైంది. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో చిన్న మండపంలో ఉంచారు. ఆలయాలు తగ్గు ప్రదేశంలో ఉండడం వల్ల అమ్మవారి ఆలయం కంటే ఊళ్లో ఎత్తైన భవనాలు కట్టుకుంటే అరిష్టమని ఏళ్లనాటిగా ప్రజల్లో నాటుకుపోయింది. ఇక్కడ కులమతాలకతీతంగా ఎవరూ ఎత్తైన భవంతులు కట్టుకోవడం లేదంటే ఆ నమ్మకం ఎంతలా పాతుకుపోయిందో తెలుస్తుంది... ఇప్పుడిప్పుడే వస్తున్న ప్రజల ఆలోచనల్లో మార్పుల వల్ల భవంతులు కట్టుకుంటున్నామంటున్నారు స్థానికులు.
పండితులేమంటున్నారు
ఈ క్షేత్రంలో అంతస్తులు కడితే అరిష్టమనేది వదంతి మాత్రమేనని... ఈ విషయం ఏ గ్రంథాల్లోనూ ప్రస్తావించలేదని పండితులు తెలిపారు.
వదంతులను నమ్మొద్దు
ఎత్తైన భవంతుల నిర్మాణం కట్టవద్దనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కనుక భయాలు వీడి ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుమతులు కూడా మంజూరు చేస్తామంటున్నారు.
పురపాలికగా మారిన అలంపూర్లో సుమారు 17 వేల జనాభా ఉంది. ఇక్కడి ప్రజలు ఇప్పటికైనా భయం వీడి భవంతుల నిర్మించుకోడానికి ముందుకొచ్చేందుకు ప్రయత్నించాలంటున్నారు అధికారులు.