అల్లంత దూరాన అలల సవ్వడులు.. చల్లని పిల్ల గాలులు.. కళ్లార్పకుండా చూద్దామనేంత ప్రకృతి సౌందర్యం.. ఇవన్నీ జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టు సొంతం. గద్వాల దగ్గల్లో ఇంత మంచి ప్రాంతముందా.. ఐతే మనమూ ఓసారి వెళ్లోచ్చేద్దాం అనుకుంటే మాత్రం కొన్ని అవస్థలు పడాలి మరి. ఇక్కడ పేరుకే పర్యటక ప్రాంతం కానీ కూర్చుందామంటే కుర్చీలుండవ్. తాగుదామంటే మంచి నీరు దొరకదు. కనీసం నిలువ నీడ దొరకని పరిస్థితి. పాలకులు, అధికారుల అలసత్వమే ఇందుకు కారణం.
11 టీఎంసీల సామర్థ్యంతో 1981లో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1996లో ప్రాజెక్టు పూర్తయింది. రోజూ వందలాది మంది పర్యటకులు ప్రాజెక్టును చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద తాకిడి మొదలైనందున ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ వసతుల లేమి పర్యటకులని అవస్థలకు గురిచేస్తుంది.
వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే పార్కు కోసం రూ.6 కోట్లు కేటాయించినా పనులు చేయని కారణంగా నిధులు వెనక్కి వెళ్లాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ.15 కోట్లతో బృందావనం పార్కు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సుదూర ప్రాంతాల నుంచి ప్రాజెక్టును చూసేందుకు వచ్చామని కనీసం నిలువ నీడ లేదని పర్యటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం వస్తే తలదాచుకోవడానికి.. దాహం వేస్తే తాగునీటికి వసతులు లేవని.. ప్రభుత్వం వెంటనే స్పందించి సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరుతున్నారు. ప్రకృతి రమణీయమైన జూరాల ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసి మరింత మందికి చేరువ చేయాలి.
ఇదీ చూడండి: వానకాలం చదువులంటే ఇవేనేమో..!