జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆర్టీడీఎస్ కాలువకు గండి పడి సమీప పొలాలు జలమయం అయ్యాయి. పంట చేతికొచ్చిన సమయాన కాలువకు గండి పడి రైతులకు కన్నీళ్లు మిగిలాయి. ఐజ మండలం సిందనూరు సమీపంలో 12వ డిస్ట్రిబ్యూటర్ వద్ద గండి పడింది. సుమారు 120 ఎకరాల వరి పంట నీటమునిగింది.
చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండి పడి రెండు రోజులు కావొస్తున్నా ఇంతవరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదని వాపోయారు. కొంతమంది పంటను కోసి పొలాల్లోనే ఉంచారు. రాత్రి వేళ కాలువకు గండి పడి నోటి దాకా వచ్చిన పంట నీట మునిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గండి పడిన కాలువను ఎమ్మెల్యే అబ్రహం పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఆర్డీఎస్ కాల్వకు అధికారుల పర్యవేక్షణ లోపించింది. నీటిని మళ్లించే షట్టర్లు పని చేయడం లేదు. రెండు రోజులైనా నీరు ఇంకా ప్రవహిస్తోంది. కొన్నేళ్లుగా ఆర్డీఎస్ ప్రధాన కాలువలు మరమ్మతులు చేయకపోవడం వల్ల ఏటా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. తడిసి ముద్దైన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలి?.
-రైతులు
ఇదీ చదవండి: రాష్ట్రంలో 50 వేలకు పైగా ఉద్యోగాల సత్వర భర్తీకి చర్యలు