జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో అలజడి నెలకొంది. గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్‌పై కొందరు తెరాస కార్యకర్తలు దాడి చేశారు. సభ ముగిసిన అనంతరం సాయి చంద్ తన అభిమానులతో ముచ్చటిస్తుండగా ఒక్కసారిగా అజయ్‌కు సంబంధించిన వర్గీయులు దాడి చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్‌తో పాటు తన వర్గీయులు అల్లంపూర్ నియోజకవర్గంలో ఇక్కడ నీకేంటి పని అని ఒక్కసారిగా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందో తెలియక పోలీసులు తికమకపడ్డారు. ఇటు రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ సాయి చంద్ కాగా.. మరొకరు ఎమ్మెల్యే అబ్రహం తనయుడు కావడంతో పోలీసులు ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో సాయి చంద్ గన్‌మెన్ అతని అనుచరునికి గాయమైందని పోలీసుల ముందు మొరపెట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్ కుమార్ కావాలనే తన అనుచరులతో కలిసి ఇలా దాడి చేయించారని సాయి చంద్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమీకృత వజ్రోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో వర్గ పోరు తీవ్ర చర్చనీయాంశమైంది.
"దళిత నియోజక వర్గం కాబట్టి ఒక దళిత బిడ్డగా నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఇక్కడనే కాదు ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ నాకు ఉంది. ఎమ్మెల్యే కొడుకు స్టేజీ మీద కూర్చున్నాడు. ఏ హోదాలో ఆయన అక్కడ కూర్చున్నారు. అధికారులు నాకు సమాధానం చెప్పాలి. ఒక ఆర్డీవో కూర్చోడానికి కుర్చీ లేకపోతే అతను కనీసం లేవకుండా అలానే ఉన్నాడు. ఆర్డీవో పక్కకి వెళ్లిపోయారు. నేను ఆయనకి కుర్చీ ఇచ్చి కూర్చోమన్నాను. నేను ఇక్కడికి రావడం ఇష్టం లేక ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్‌తో పాటు తన వర్గీయులు నాపై దాడి చేశారు". -సాయిచంద్, రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్
ఇవీ చదవండి: