గుర్రంగడ్డలో 160 ఇళ్లు ఉన్నాయి. సుమారు 760మంది జనాభా ఉంటారు. కృష్ణా నది మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లాలన్నా.. రావాలన్నా పడవ ప్రయాణమే దిక్కు. వర్షాకాలంలో కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వ్యవసాయ సామాగ్రి తేవాలన్నా, చివరకు పండించిన ధాన్యం విక్రయించాలన్నా బోటు ప్రయాణం తప్పనిసరి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారులను దవాఖానాకు తీసుకెళ్లాలన్నా అష్టకష్టాలు పడాల్సిందే.
ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు గ్రామానికి బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 11.05 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. గద్వాల శాసనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి బ్రిడ్జి శంకుస్థాపన చేశారు.
ఇన్నాళ్లు పడిన కష్టాలు తీరనున్నాయని గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.