CM Revanth Reddy Speech in LB Stadium : ప్రజాప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే, ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కులగణనపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేన్న సీఎం రేవంత్ రెడ్డి, సంక్షేమ పథకాలు పెంచడానికే సమగ్ర సర్వే చేస్తున్నామని పునరుద్ఘాటించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. తాము అధికారంలో వచ్చాక విద్యాశాఖను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించామని వివరించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకంతో పాటు దేశంలో తొలిసారి విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలను వారంలో రెండు రోజులు సందర్శించాలని సూచించారు.
"ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఆ ప్రతిష్ఠ పునరుద్ధిరంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రైవేట్ పాఠశాలల కంటే అన్నిరకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు నా సూచన, తప్పకుండా పాఠశాలలను పరివేక్షించండి. వాళ్ల సమస్యలను తెలుసుకోండి. అదేవిధంగా కలెక్టర్లు సహా జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షించకుంటే వారి ప్రమోషన్ల విషయంలో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటాం."-సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకు పంపుతాం : గురుకులాలు, ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే, జైలుకెళ్లటం ఖాయమని నిర్వాహకులను హెచ్చరించారు. విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి అన్నం పెట్టాలని, దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయాలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు. పిల్లలు మరోసారి కలుషిత ఆహారంపై రోడ్డెక్కి ఆందోళనలు చేయడం కనపడొద్దని స్పష్టం చేశారు. ఎవరు అడ్డొచ్చినా కులగణన ఆగదన్న ముఖ్యమంత్రి సర్వేపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేనని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి కులగణనపై అవగాహన కల్పించాలని కోరారు.
అంతకు ముందు బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌సీఈఆర్‌టీలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి హాజరయ్యారు. మాక్ అసెంబ్లీని వీక్షించి, వారిని అభినందించారు. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి.. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువతరం ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
గవర్నర్ అనుమతి రాగానే ఈ-రేస్ స్కామ్‌లో కేటీఆర్‌పై చర్యలు : సీఎం రేవంత్‌రెడ్డి
తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్మాల్సిన పని లేదు : అన్నదాతలకు సీఎం కీలక సూచన