bio pot: జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన శ్రీజ.. వినూత్న ఆలోచనతో అబ్బురపరచింది. మొక్కల నిల్వ, సరఫరాకు విస్తృతంగా వినియోగించే ప్లాస్టిక్ కవర్లకు పరిష్కారం కనుగొనాలని తపించింది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిలో కలిసిపోయే ముడి పదార్థాలతో బయోపాట్ తయారు చేయాలని భావించింది. ఇదే ఆలోచనను ఉపాధ్యాయుడు అగస్టీన్‌తో చెప్పగా.. ఇద్దరూ కలిసి బయోపాట్‌కు రూపకల్పన చేశారు. గ్రామంలో విస్తృతంగా లభించే వ్యవసాయ వ్యర్థాలు, వేరుశనగ పొట్టునే ముడి పదార్ధంగా తయారు చేసి.. భూమిలో కలిసిపోయే కుండలను రూపొందించారు.
శ్రీజ రూపొందించిన బయోపాట్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో 'ఉత్తమ ఆవిష్కరణ'గా నిలిచింది. టీఎస్ఐసీ ప్రతినిధులు.. శ్రీజను టీవర్క్స్‌కు పరిచయం చేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ కేంద్రంగా పేరున్న టీవర్క్స్.. విద్యార్థిని శ్రీజ ఆలోచనకు కొన్ని మార్పులు చేసింది. బయోప్రెస్ అనే ప్రత్యేక పరికరాన్ని రూపొందించి అందించింది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ ఆలోచనను మెచ్చిన జీఈ అప్లియన్సెస్ కంపెనీ.. ఒక పరిశ్రమగా మలచుకునేందుకు కావాల్సిన సామగ్రిని అందజేసింది. ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం కోసం బయోడీగ్రేడబుల్ పాట్‌ను రూపొందించిన శ్రీజ.. పదో తరగతి పూర్తి కాకముందే.. శ్రీజ గ్రీన్ గెలాక్సీ పేరుతో పరిశ్రమ ఏర్పాటు దిశగా ఎదిగింది.
టీఎస్ఐసీ, ఆగ్ హబ్, ఎస్ఆర్ఐఎక్స్ సహకారంతో శ్రీజ పారిశ్రామికవేత్తగా ఎదగడంపై ఆమెను మొదటి నుంచి ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు అగస్టీన్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీజ మరిన్ని విజయాలు సాధించాలని.. గ్రామస్థులు కోరుతున్నారు. నర్సరీలో పది వేల మొక్కలు పెంచడానికి 200 కేజీల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తారని.. తాను రూపొందించిన బయోపాట్స్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని శ్రీజ కోరుతోంది.
ఇవీ చూడండి..