జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీ యువతకు రాయితీ రుణాలు అందించడంలో సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లు గడుస్తున్నా.. ప్రకటించిన లక్ష్యం మేర కూడా రుణాలు అందించని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రమే రుణాలు అందించగా, ఏటా జరగాల్సిన రుణాల మంజూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుణాలు అందించలేదు. కొవిడ్-19 కారణంగా చాలా మంది యువత ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ప్రకటించిన రుణాలు అందించినా, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ప్రతి ఏటా బీసీ రాయితీ రుణాలు అందించాల్సి ఉండగా, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం నిధుల కేటాయించకపోవడం వల్ల రుణాలు అందలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించింది. రెండేళ్ల విరామం తరువాత ప్రకటన రావడం వల్ల ఎంతో ఆశతో జిల్లాలో 3,125 మంది దరఖాస్తులు చేసుకున్నారు. విడతల వారీగా రుణాలని నిర్ణయించారు.
ఈ మేరకు మొదటగా వందశాతం రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు ఇచ్చే ప్రక్రియను 2018 ఆగస్టు 15న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. అయినా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్ల లబ్ధిదారులందరికీ రుణాలు అందలేదు.
ఇచ్చింది 937 మందికే.. :
జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు, నాలుగు పురపాలికలున్నాయి. వీటిలో వేలాది మంది యువకులు ఉద్యోగాలు లేక నిరుత్సాహంలో ఉన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. రెండున్నరేళ్ల క్రితం జిల్లాలో బీసీ రుణాల కోసం మొత్తం 3125 మంది వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే గ్రూపు రుణాల కోసం మరో 7200 దరఖాస్తులు చేసుకున్నారు.
ఇందులో మొదటి విడతగా 86 మందికి, రెండో విడతగా 402, మూడో విడతగా 449 మందికి రుణాలిచ్చారు. ఇలా ఏడాది కాలంలో 937 మందికి వందశాతం రాయితీతో రూ.50 వేల చొప్పున రూ.4.68 కోట్ల రుణాలిచ్చారు. ఇంకా 2188 మంది, గ్రూపుగా ఉన్న 7200 మంది రుణాలు అందించలేదు. నిధులున్న సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఒక్కరికీ రుణాలు అందించలేదు. ప్రస్తుతం ఉన్న నిధులు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీసీ యువతకు ఇప్పట్లో రాయితీ రుణాలు అందేలా కనిపించడం లేదు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి :
బీసీ రాయితీ రుణాలకు సంబంధించి నిధులు రావాల్సి ఉంది. గతంలో మంజూరైన నిధుల ఆధారంగా, అర్హులైన వారిని ఎంపిక చేసి కొందరికి ఇవ్వడం జరిగింది. కొంత కాలంగా రుణాల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నిలిచిపోయింది. సమస్యను ఉన్నతాధికారులకు తెలిపాం.
- ఇందిర, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి, జోగులాంబ గద్వాల
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్