PRAJA SANGRAMA YATRA: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన రెండోదశ ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి సన్నిధి అలంపూర్ నుంచి రెండో దశ పాదయాత్ర మొదలవనుంది. తొలుత అలంపూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి.. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారిని సంజయ్‌తో పాటు అగ్రనేతలు దర్శించుకుంటారు. తొలిరోజు అలంపూర్ నుంచి ఇమామ్‌పూర్ వరకు 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలోనే సాయంత్రం జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భాజపా నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు.
7 నుంచి 11:30.. 4 నుంచి 8..
31 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో 29 రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బండి సంజయ్ పర్యటిస్తారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలతో సహా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది.
స్థానిక అంశాల ప్రస్తావన..
పాదయాత్ర విరామ సమయంలో బండి సంజయ్ గ్రామాల్లోని వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తెరాస ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, ధాన్యం కొనుగోళ్లు, యువతకు ఉద్యోగాలు సహా పలు స్థానిక అంశాలను పాదయాత్రలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.
31 రోజులు.. 387 కిలోమీటర్లు..
సంజయ్ సంగ్రామ యాత్ర పార్టీ బలోపేతానికి, శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకు దోహదం చేస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత యాత్ర 31 రోజుల పాటు 387 కిలోమీటర్ల మేర సాగనుంది. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పాదయాత్ర ముగియనుంది. ముగింపు సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో భారీ జన సమీకరణకు కమలదళం కదులుతోంది.
ఇవీ చూడండి:
Bandi Sanjay Visit Yadadri Temple: 'యాదాద్రి నారసింహుడు మా ఇలవేల్పు'