జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఓ సిలిండర్ మూతకు ఉన్న నీటి బుడగ పగలడంతో ఆ శబ్దానికి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అందులో ఒక రోగి వార్డులోకి తిరిగి వచ్చే సమయంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల వాడకంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగినప్పుడు మేల్కొనే కంటే ముందే జాగ్రత్త చర్యలు తీసుకుంటే రోగులు, వారి బంధువుల్లో ఆందోళనను తగ్గించవచ్చు.
సామర్థ్యం పెంచితే మరింత జాగ్రత్త అవసరం..
ప్రభుత్వం కొవిడ్-19 బాధితులకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లను పెంచాలని నిర్ణయించింది. 100 పడకల ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండరు పెంచితే వాటిని వార్డుల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గద్వాల ఆస్పత్రిలో సోమవారం జరిగిన ప్రమాదం దృష్ట్యా సిలిండర్ల వాడకంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. వీటిని వార్డుల్లో కాకుండా ఆస్పత్రి బయట ఏర్పాటు చేసి సెంట్రల్ లైనరు ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ సేవలను విస్తరించనున్నారు. ఇప్పటికే కొవిడ్-19 రోగులకు కేటాయించిన 220 పడకలకు, పాత ఐసీయూలోని 40 పడకలకు, కొత్త ఐసీయూలోని 70 పడకలకు, క్యాజువాలిటీలోని 30 పడకలకు ఆక్సిజన్ అందించే సౌకర్యం ఉంది. ప్రభుత్వం సామర్థ్యం పెంచే అవకాశం ఉండడంతో రోగులకు మరింత సేవలు అందనున్నాయి.
చిన్న సిలిండర్ల ప్రమాదం ఉండదు
క్యాజువాలిటీ, బేబీ కేర్ వార్డుల్లో చిన్న సిలిండర్ల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని గద్వాల ఆస్పత్రి పర్యవేక్షకురాలు డా.శోభారాణి అన్నారు. కొవిడ్, ఐసీయూ, ఇతర వార్డుల్లో మాత్రమే సెంట్రలైజ్డ్ సిలిండర్లను బయట ఏర్పాటు చేసి పైప్‌లైన్ ద్వారా రోగులకు ఆక్సిజన్ అందిస్తారని చెప్పారు. కొవిడ్ పూర్తిగా తొలగి అన్ని వార్డులను ఆసుపత్రికి ఉపయోగించాల్సి వస్తే అప్పుడు పైపులైన్ పద్ధతి చేపట్టాల్సి ఉంటుందన్నారు.