హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన చిన్నారెడ్డి సమర్థవంతమైన నాయకుడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గతంలో ఎమ్మెల్సీలుగా పని చేసిన నాయకులు.. ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై ఏనాడు పల్లెత్తు మాట మాట్లాడలేదని సంపత్‌కుమార్ ఆరోపించారు. అలాంటి నేతలు మళ్లీ బరిలో నిలిచి.. ఓటు వేయమని అడగటం ఏంటని ఎద్దేవా చేశారు. తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ, నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం: శ్రీనివాస్ రెడ్డి