Niranjan Reddy: ఇకనైనా అక్రమ ప్రాజెక్టులను ఆపండి... లేకుంటే చూస్తూ ఊరుకోం - వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ... మనకు వచ్చే నీటి వాటాను ఆంధ్ర పాలకులు తరలించే ప్రయత్నం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా ఆంధ్ర పాలకుల బుద్ధి మారడం లేదని ద్వజమెత్తారు. తెలంగాణ వాటాలోని ఒక్క నీటిచుక్కను కూడా వదిలే ప్రసక్తి లేదని తెలిపారు.
న్యాయంగా రావాల్సిన నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ ఆంధ్ర పాలకుల బుద్ధి మారడం లేదని... అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారాని ఆరోపించారు. ఓవైపు కృష్ణ మరోవైపు తుంగభద్ర నదులు ఉన్న నడిగడ్డ నీళ్ల కోస తీవ్ర ఇబ్బందులు పడిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలంలోని తక్కశిల రైతు వేదికలను. వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
ఒక్క చుక్క నీటిని కూడా వదలము...
ప్రాజెక్టులు నిర్మించాలంటే సరైన అనుమతులతో కొత్త ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నదిపై గల ఆర్డీఎస్ వద్ద కుడికాలును అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపించారు. అక్రమంగా నీటిని తరలిస్తే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మనకు రావాల్సిన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని తెలిపారు.
24 వరకు అందరి ఖాతాల్లో రైతుబంధు..
రాష్ట్రంలో సుమారు కోటి యాభై వేల ఎకరాల సాగుభూమి ఉందని తెలిపారు. వానకాలం సీజన్ కోసం రైతుబంధు డబ్బులు ఇప్పటివరకు 93 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ నెల 24 వరకు అందరి ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు.
ఇదీ చదవండి: CM KCR: సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్