జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా కట్టడి కోసం పట్టణంలో అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటిదాక అలంపూర్లో 122 కేసులు నమోదు కాగా ముగ్గురు మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు.
కరోనాపై అవగాహన పెంచేందుకు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అనంతరం పలు కాలనీలలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు వైరస్ తీవ్రత తెలియజేస్తూ.. నివారించేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మదన్ మోహన్, మున్సిపల్ ఛైర్మన్ మనోరమా వెంకటేష్, వైద్య సిబ్బంది, పోలీసులు తదితరులున్నారు.