Illegal Mining in Gadwal District : భారత్ మాలలో భాగంగా మహారాష్ట్రలోని అక్కల్కోట నుంచి చెన్నై వరకు 15వ నెంబర్ జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని నందిన్నె నుంచి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల వరకు 77 కిలోమీటర్ల పనులను ఓ ప్రముఖ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో నందిన్నె నుంచి జూలకల్ వరకు మొదటి దశలో భాగంగా 38 కిలోమీటర్ల మేర పనులు నడుస్తున్నాయి.
ఇష్టానుసారంగా గుట్టల్ని తవ్వేస్తున్నారు: ఈ పనులకు పెద్దఎత్తున మొరం, పలుగురాళ్లు, కంకర అవసరం. అందుకోసం రహదారి విస్తరిస్తున్న ప్రాంతాల్లో, గుట్టల్ని రోడ్డు నిర్మిస్తున్న కంపెనీ ఇష్టానుసారం తవ్వేసుకుంటూ వెళ్తోంది. మొరం రాళ్లు లాంటివి తవ్వుకుని వాడుకోవాలంటే, ముందుగా మైనింగ్, రెవెన్యూ సహా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే రహదారికి సమీపంలోని గుట్టల్ని సదరు కంపెనీ ఇష్టానుసారం తవ్వేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా: మైనింగ్, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నప్పుడు కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి చర్యలేవీ లేకుండా నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ఆ దుమ్ము, ధూళీ సమీపంలోని పంటలపైకి చేరి.. పంటలు నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో విత్తన పత్తి, వేరుశనగ సహా ఇతర పంటలు వేశారు. మట్టి, రాళ్లు పంట పొలాలపై పడి తమ దిగుబడి వదులుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్టలపై రాళ్లను తవ్వేందుకు పేలుళ్లు జరుపుతున్నారు. అందుకు ఎలాంటి అనుతులు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. రాయికల్, వడ్డేపల్లి వద్ద నిబంధనలకు విరుద్ధంగా క్రషింగ్ యంత్రాలు ఏర్పాటు చేసి కంకర తయారు చేస్తున్నారు. దుమ్ము పడకుండా కనీసం నీటిని కూడా చల్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు, మూడు నెలల్లో జిల్లాలోని నందిన్నె నుంచి వడ్డేపల్లి వరకు పదుల సంఖ్యలో గుట్టలు పూర్తిగా కనిపించకుండా పోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
శాఖల అనుమతి లేకుండా: మట్టి, మొరం, రాళ్లు, ఇసుక లాంటివి తవ్వి వ్యాపార అవసరాల కోసం వాడుతున్నప్పుడు తప్పకుండా మైనింగ్, రెవెన్యూ సహా సంబంధిత శాఖల అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు మైనింగ్ శాఖ దృష్టికి రావడంతో, ఆ శాఖ నుంచి సదరు కంపెనీకి షోకాజ్ సహా డిమాండ్ నోటీసులు సైతం జారీ అయ్యాయి.
నోటీసులు ఇచ్చినా లేని మార్పు: కేటీ దొడ్డి మండలం కుచినెర్ల, గట్టు మండలం రాయపురం, వడ్డేపల్లిలోని 5 ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లోంచి నిబంధనలకు విరుద్ధంగా.. మట్టి, రాళ్లు, క్వార్డ్జ్ తరలించినట్లుగా అధికారులు గుర్తించారు. తరలించుకుపోయిన మట్టి, రాళ్లకు చెల్లించాల్సిన సీనరేజీ ఛార్జీలపై పది రెట్లు అపరాధ రుసుము చెల్లించాలని ఆ శాఖ నుంచి ఫిబ్రవరిలో షోకాజ్ నోటీసులు వెళ్లాయి. అయినా స్పందించకపోవడంతో డిమాండ్ నోటీసులు సైతం జారీ చేశారు. వాటి ప్రకారం సదరు కంపెనీ రూ.52.35 కోట్లు చెల్లించాల్సి ఉంది.
నిర్మాణ సంస్థను మచ్చిక చేసుకున్న స్థానిక రెవెన్యూ అధికారులు, కొందరు జిల్లా అధికారులు ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి, కొందరు స్థానిక నేతలే నిబంధనల ఉల్లంఘనలకు తెరవెనక నుంచి ఊతమిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ప్రకృతి సంపద పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: