రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఏబీసీ కార్యక్రమం అమలుకాగా జోగులాంబ గద్వాలలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఎంఈవో, హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీచేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కస్తూర్బా పాఠశాలల్లో 3 నుంచి 8వ తరగతి వరకు గల విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
ఆగస్టు 31న అంత్యపరీక్ష
ప్రారంభం రోజు బేస్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాతి రోజు నుంచి కనీస సామర్థ్యాలు లేని విద్యార్థులను ఏ, బీ, సీలుగా విభజించి బోధన చేస్తారు. గుర్తించిన వారికి ప్రతి 10 రోజులకు ఒకసారి పరీక్ష నిర్వహించి వారి అభ్యసనాభివృద్ధిని విశ్లేషిస్తారు. చూచిరాత పుస్తకాలు, డిక్టేషన్ వంటి ఇతర విధానాలను అమలుచేయనున్నారు. చివరి రోజైన ఆగస్టు 31న అంత్యపరీక్ష నిర్వహించి విద్యా సామర్థ్యాల పెంపునకు కృషిచేస్తారు.
45వేల మందిపై దృష్టి
జిల్లాలోని 477 ప్రభుత్వ పాఠశాలల్లో 62వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. 1, 2, 9, 10 తరగతుల విద్యార్థులను మినహాయిస్తే.. జిల్లాలో సుమారు 45వేల మంది విద్యార్థులు ఇతర తరగతుల్లో ఉంటారు. ఇందులో చాలా మంది విద్యార్థులు 8వ తరగతి దాటినా తెలుగులో ఆగకుండా చదవడం, తప్పులు లేకుండా రాయటం, కూడికలు, తీసివేతలు, ఆంగ్లం చదవడం రానివారే.
ఆందోళనకరమే!
ఈ మధ్య పిల్లల స్థాయిపై జరిగిన వివిధ అధ్యయనాల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ సాధన సర్వే-2017 ప్రకారం.. 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థుల్లో భాషాస్థాయి, గణతంలో కూడికలు, తీసివేతలు చేయలేని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ‘ప్రథమ్’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలోనూ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. చదవటం, రాయటం, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయగలగటం వంటి సామర్థ్యాలు అందుకోలేకపోతున్నట్లు తేలింది. ఇందుకు ఉపాధ్యాయుల కొరత, ప్రధానోపాధ్యాయుల నుంచి డీఈవో దాకా ఇన్‌ఛార్జులే ఉండటం, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడం కారణాలు.
మూలాల్లోకి వెళదాం
ఈ విద్యా సంవత్సరం ఏబీసీ(మూలాల్లోకి వెళదాం) కార్యక్రమం అమలుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం ఏ మేరకు విజయవంతం అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో ఉండటం కొంత ఆశాజనకమే అయినా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నది విద్యావేత్తలు చెబుతున్న మాట.
- ఇదీ చూడండి : 12 ఏళ్ల బాలుడు... 135 పుస్తకాలు రచించాడు!