మహిళల జాబితా సిద్ధం : సిరిసిల్లలో తయారుచేసిన చీరలను ‘బతుకమ్మ కానుక’ పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు 18 సంవత్సరాలు పైబడిన మహిళల జాబితాను సిద్ధం చేశారు. చేనేత అధికారుల ఆధ్వర్యంలో పంపిణీని ప్రారంభించనున్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 255 గ్రామపంచాయతీలు, గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికలున్నాయి. మొత్తం 333 చౌకధర దుకాణాల పరిధిలో ఆహారభద్రత కార్డులు కలిగిన 1.57 లక్షల కుటుంబాలున్నాయి.
పెరిగిన అర్హులు : జిల్లాలో ఏటా బతుకమ్మ చీరలు తీసుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్ల కిందట 1.84 లక్షల మంది అర్హులుండగా.. గతేడాది 1.92 లక్షలకు పెరిగారు. ఈ ఏడాది 2.02 లక్షల మంది అర్హులున్నట్లుగా గుర్తించారు. జిల్లాకు రెండు విడతల్లో 1.78 లక్షల చీరలు వచ్చాయి. మిగిలిన వారికి త్వరలో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా గద్వాల మండలంలో 34,717, అత్యల్పంగా ఉండవల్లిలో 9,434 మంది ఉన్నారు. రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారుల ద్వారా పంపిణీ చేయనున్నారు.
కరోనా వేళ పంపిణీ ఎలా..? : కరోనా వ్యాప్తి ఉండటంతో.. చీరల పంపిణీ ఎలా చేయాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పంచడం.. లేదంటే డీలర్ల ద్వారా కనీస దూరం పాటిస్తూ అందించడం లాంటి పద్ధతులను ప్రభుత్వం సూచించింది. దీనిపై జిల్లా పాలనాధికారి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకొని, పంపిణీపై తుది నిర్ణయాన్ని తీసుకోవాలని చెబుతోంది. దానిపై త్వరలోనే స్పష్టత రానుందని అధికారులు చెబుతున్నారు.
అందరికీ అందేలా చర్యలు.. : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అక్టోబర్ 9 నుంచి ప్రారంభించాలని ఆదేశాలొచ్చాయి. ఏయే మండలానికి ఎన్ని పంపించాలనే దానిపై జిల్లా అథికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కలెక్టర్ ఆదేశాలు ప్రకారం రెవెన్యూ అధికారుల సహకారంతో పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం.
- చరణ్, చేనేత, జౌళిశాఖ ఏడీ, జోగులాంబ గద్వాల
మండలాల వారీగా 18 ఏళ్లు దాటిన వారు
మండలం | మహిళలు |
అయిజ | 29,552 |
వడ్డేపల్లి | 11,251 |
ఇటిక్యాల | 16,299 |
మానవపాడు | 10,498 |
అలంపూర్ | 11,678 |
ఉండవల్లి | 9,434 |
రాజోలి | 11,913 |
ధరూర్ | 16,014 |
గద్వాల | 34,717 |
గట్టు | 19,527 |
మల్దకల్ | 19,286 |
కేటిదొడ్డి | 12,653 |
- ఇదీ చూడండి: రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!