ప్రభుత్వ తోడ్పాటు, వైద్య శాఖ, పోలీస్ సిబ్బంది సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించిన జిల్లా యంత్రాంగాలను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అభినందించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా, పాజిటివ్ కేసులు పెరగకుండా సమర్థ చర్యలు తీసుకున్నారన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్‌తో కలిసి ఆస్పిరేషనల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుని, వారికి కావాల్సిన సరకులను సరఫరా చేసి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని కలెక్టర్లు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించేలా, మాస్కులు ధరించే బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వైద్య సిబ్బందికి వైరస్ వ్యాపించకుండా పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచామని చెప్పారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ పస్తులతో ఉండకుండా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సహకారంతో నిత్యావసర సరకులను అందజేసినట్లు కలెక్టర్లు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్‌కు వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పేదలకు పని కల్పించి ఆర్థిక తోడ్పాడు అందించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు శిబిరాలు ఏర్పాటు చేసి వసతి కల్పించామని వెల్లడించారు.
ఎవరూ ఊహించని ఈ హఠాత్పరిణామానికి ప్రపంచం తలకిందులవుతున్న సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన లాక్డౌన్ పిలుపుతో దేశంలోని రాష్ట్రాలన్ని సమర్థంగా అమలు జరిగిందని ఇదే సమయంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కరోనా నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా చేపట్టారని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అభినందించారు. ఒక వైపు కరోనా వైరస్ భయం ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం ప్రజల సేవకు చూపిన చొరవ అత్యంత అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆస్పిరేషనల్ జిల్లాలు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.