కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి సరస్వతి బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోసే గ్రావిటీ కెనాల్లో ప్రమాదవశాత్తు రెండు దుప్పులు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కన్నెపల్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాహం తీర్చుకోవడం కోసం కెనాల్ వద్దకు వచ్చిన వన్యప్రాణులు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకొని బేస్ క్యాంపు సిబ్బంది సాయంతో బయటకు తీశారు. తాళ్లతో తీస్తున్న క్రమంలో ఒక దుప్పి మరణించింది. మరో దానికి గాయాలయ్యాయి. చనిపోయిన దానిని కాళేశ్వరంలో ఖననం చేశారు. గాయపడ్డ దుప్పిని మహదేవ్పూర్ వెటర్నరీ ఆసుపత్రికి తరలిస్తుండగా సిబ్బంది చేతుల్లో నుంచి పారిపోయింది. దుప్పిని పట్టుకునే క్రమంలో సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. దానికి ప్రథమ చికిత్స అందించి... మెరుగైన వైద్యం కోసం వరంగల్ జూపార్క్‌కు తరలించినట్టు ఉప అటవీ క్షేత్రాధికారి సురేష్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్