pranahitha pushkaralu: బృహస్పతి మీన రాశిలో ప్రవేశించిన సమయంలో వేదమంత్రోచ్చారణలతో బుధవారం ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు కలశ పూజలు నిర్వహించి పుష్కరుడిని ఆవాహనం చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సతీసమేతంగా హాజరై పుష్కరాలను ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం బుధవారం మధ్యాహ్నం 3.50 కాగా, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్ సాయంత్రం 4.06 గంటలకు పుష్కరుడి చిత్రపటానికి పూజలు చేశారు. వేదపండితులు నదికి చీర, సారె, పసుపు, బియ్యం సమర్పించి హారతి ఇచ్చి పుష్కరాలు ప్రారంభించారు.
* ప్రాణహిత జన్మస్థలం కుమురం భీం జిల్లా కౌటాల మండంలోని తుమ్మిడిహెట్టి ఘాట్ వద్ద సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప-రమాదేవి దంపతులు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి ఘాట్ వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సిరోంచ పుష్కరఘాట్ వద్ద మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే శాస్త్రోక్తంగా పుష్కరాలను ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు షిండే చెప్పారు. తొలిరోజున ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రాణహిత తీరానికి భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేశారు.
పుష్కరాలను పట్టించుకోని కేసీఆర్
పన్నెండు సంవత్సరాలకు వచ్చే పండగ ఇది. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాం. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా ఘనంగా నిర్వహిస్తారని అనుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు. కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి.
కాళేశ్వరంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
పుష్కరాలనూ రాజకీయం చేసే ప్రయత్నం
జీవనదులతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని పుష్కరుణ్ని వేడుకున్నా. ప్రతిపక్ష నేతలు కొంతమంది పుష్కరాలను సైతం రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.
అర్జునగుట్ట వద్ద రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
పుష్కరయాత్రకు పర్యాటక బస్సులు
ఈనాడు, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి పర్యాటక బస్సులు నడపనున్నట్లు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. ఏప్రిల్ 24 వరకు హైదరాబాద్ నుంచి రోజూ పుష్కరయాత్ర నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టూర్ ప్యాకేజి వివరాల్ని వెల్లడించారు. టికెట్ ధర ఏసీ బస్సులో: పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760. నాన్
ఏసీ బస్సు: పెద్దలకు 2,000. పిల్లలకు రూ.1,600.ప్యాకేజీలో కాళేశ్వరం ఆలయ దర్శనం, శాకాహార భోజనం ఉంటాయి.
ప్రయాణం వివరాలు: ఉ.5 గంటలకు బషీర్‌బాగ్ నుంచి బయల్దేరే బస్సు 11 గంటలకు కాళేశ్వరం చేరుకుంటుంది. 12.30 వరకు సిరొంచ పుష్కర్‌ఘాట్ వీక్షణ. ఒంటిగంటకు కాళేశ్వరం ఆలయ దర్శనం. 1.45కి భోజనం. మ.2.45కి బయల్దేరి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. వివరాలు 9848540371 ఫోన్ నంబరులో గానీ, https://tourism.telangana. gov.in/package/kaleshwarampushkaralu వెబ్‌సైట్‌లో గానీ తెలుసుకోవచ్చు.
ఇవీ చూడండి:
Pranahitha Pushkaralu 2022: 'లాంఛనంగా ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం'