జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, జుక్కల్, చల్లగరిగ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ధాన్యం, మొక్కజొన్నల కేంద్రాన్ని ప్రారంభించారు. పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందిపడకూడదని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. పంటను తమ గ్రామంలోనే అమ్ముకునే విధంగా ప్రభుత్వం తరఫున ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం మొక్కజొన్నలను పెద్దపల్లి జిల్లాకు పంపిస్తున్నామని తెలియజేశారు.
ధాన్యంలో తాలు, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని కోరారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులెవరూ అధైర్యపడొద్దని పేర్కొన్నారు. టోకెన్ పద్ధతి ద్వారా వ్యవసాయ అధికారులు చెప్పిన విధంగా నడుచుకుంటూ వారికి సహకరించాలని సూచించారు. కరోనా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా కరోనా నియంత్రణకు సూచనలు, పద్ధతులను పాటించాలని స్పష్టం చేశారు.