కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్-ఎన్జీటీ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్పు వెల్లడించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.
పర్యావరణ ప్రభావ మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్న ఎన్జీటీ.. అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని సూచించింది. పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలకు కమిటీ అవసరమని స్పష్టం చేసింది. ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించిన ఎన్జీటీ.. 2008-2017 వరకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలిపింది.
నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలన్న ఎన్జీటీ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అంశాలను అధ్యయనం చేయాలని పేర్కొంది. కమిటీ ఏర్పాటు తర్వాత 6 నెలల్లో అధ్యయనం పూర్తి చేయాలని, పురోగతిని కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణపై ముందుకెళ్లొద్దని ఆదేశించిన ఎన్జీటీ.. డీపీఆర్లు సమర్పించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అభ్యంతరం లేదని అభిప్రాయపడింది.