జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో గౌడ కులస్తులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. ఎల్లమ్మ, కాటమయ్య గుడి నిర్మాణానికి స్థలం కేటాయించాలని తహసీల్దార్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. గణపురం మండల కేంద్రంలో వెలిసిన రేణుక ఎల్లమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు.గౌడ కులస్తులు ఆ భూమిని గుడి నిర్మాణానికి కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయంపై పలువురు అధికారుల సమక్షంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గౌడ కులస్తులతో సమీక్ష నిర్వహించారు. ఎల్లమ్మ విగ్రహం వెలిసిన భూమిని గౌడ కులస్తులకు కేటాయించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
గతంలో అసైన్డ్ చేసుకున్న వారికి మానవతా దృక్పథంతో, అర్హత ఉంటే వేరే స్థలం ఇవ్వాలని అన్నారు. ఆ భూమిలో గ్రామస్థులకు బతుకమ్మ ఏర్పాట్లు, రేణుక ఎల్లమ్మ , కాటమయ్య గుడి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌ను ఆదేశించారు. తన వంతు సహకారం అందించి, మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. సమస్యపై వెంటనే స్పందించి గౌడ కులస్తులకు న్యాయం చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ