జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని దమ్మన్నపేట, రాయపల్లి, కనిపర్తి, నాగుర్లపల్లి గ్రామాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొక్కలు నాటారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఐక్యతతో భూపాలపల్లి జిల్లాను పచ్చదనంలో తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రతీ ఇంటికి ఆరు మొక్కల చొప్పన నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. వర్షాలు సకాలంలో కురవాలన్నా... పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా మొక్కలు పెంచటమొక్కటే మార్గమని వివరించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి భావితరాలకు మంచి పర్యావరణాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే తెలిపారు.