జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్ కార్యాలయంలో భూపాలపల్లి పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎజెండాలో ప్రవేశ పెట్టిన 16 అంశాలపై సుధీర్ఘ చర్చ చేశారు. పట్టణంలో నిర్మించ తలపెట్టిన 12 పబ్లిక్ టాయ్‌లెట్స్ కోసం.. రూ.12 లక్షల 21,500 అంచనా వ్యయం కాగా.. ఎలాంటి టెండర్లు లేకుండా సింప్లీ జిత్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వారికి రూ.48 లక్షల 86 వేలు కలెక్టర్ ఆదేశానుసారం చెల్లించారు. ఈ విషయమై సమావేశంలో చర్చ జరగగా.. కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులకు సమాచారం లేకుండా, అనుమతులు లేకుండా, టెండర్లు పిలవకుండా ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. అధికారాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌గా ఇచ్చిన నగదును తిరిగి వసూలు చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది.
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ప్రవేశ పెట్టిన 16 అంశాలలో 15 అంశాలకు ఆమోదించామని, పబ్లిక్ టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులు వివరణ ఇవ్వాలని, జిల్లా అధికారులందరూ హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి