కాంగ్రెస్ రెండు నెలలుగా మంథని నియోజకవర్గంలోని మల్లారం ఘటనపై అనవసర రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరు ఎస్సీలు మరణించిన ఘటనలను తెరాసకు అంటగట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఒక గ్రామంలో జరిగిన సంఘటనకు కాంగ్రెస్ రాష్ట్ర అధిష్ఠానం స్పందించడం ఆశ్చర్యకరమన్నారు. ఛలో మల్లారం కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గ్రామానికి వెళ్లి ఉంటే నిజానిజాలు తెలిసేవన్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏ అంశాలు లేక పోవడంతో.. కాంగ్రెస్, భాజపా అనవసర రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నలభై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎస్సీలకు చేసింది ఏమిలేదన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎస్సీలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీ నిరంతరం కొనసాగే కార్యక్రమమని.. భూమి దొరకక కొంత మెల్లగా సాగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
మంథనిలో జరిగిన ఘటనల్లో రాజకీయ ప్రమేయం ఎక్కడా లేదని... ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవను కాంగ్రెస్ భూతద్దంలో పెట్టి చూపిస్తోందని పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు ఆరోపించారు.
ఇదీ చదవండి: 'కరోనాకి చంపే శక్తి లేదు.. కానీ నిర్లక్ష్యం వహిస్తే మూల్యం తప్పదు'