MAHASHIVARATRI CELEBRATIONS: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణలతో ఆలయప్రాంగణాలు మార్మోగిపోయాయి. ప్రధాన శైవ క్షేత్రాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలో నూతన మహామండపాన్ని, కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పాలకుర్తిని పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం కేసీఆర్ హయంలోనే పాలకుర్తి రూపురేఖలు మారాయి. 100 కోట్లతో పాలకుర్తి నలుమూలల డబుల్ రోడ్లు మంజూరు చేశారు. సీఎం నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగాం జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేసి పువ్వులు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
హన్మకొండ జిల్లాలో ఘనంగా శివరాత్రి వేడుకలు
హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు సమర్పించి స్వామి వారికి మొక్కులు చెల్లిస్తున్నారు.
అనంతరం ఆలయ ఆవరణంలోని కల్యాణ మండపంలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేశారు. కార్యక్రమం పూర్తయి ఒక గంట గడిచినా ఆలయ నిర్వాహకులు సకాలంలో హాజరు కాకపోవడంతో భక్తులు గంటల తరబడి వేచి చూశారు. ఆలయ నిర్వాహకులకు తోడు పోలీసులు చర్యల వల్ల భక్తులు అసహనానికి గురై ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుని పెద్దపట్నం తొక్కేందుకు ఎగబడ్డారు. దాంతో స్వల్ప ఉద్రిక్తతల నడుమ ఈ ఘట్టం ముగిసింది.
హన్మకొండలోని సుప్రసిద్ద వేయి స్తంభాల ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి రుద్రేశ్వరున్ని దర్శించుకోవడానికి ఆలయం ముందు భక్తులు బారులు తీరారు. నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. సాయంత్రం శివపార్వతుల కల్యాణం జరుగనుంది.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
జయశంకర్ భూపాలపల్లి తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది. శివరాత్రి పర్వదినం కావడంతో కాళేశ్వర ముక్తీశ్వరా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు.
సాయంత్రం కాళేశ్వర శుభానందాదేవిల కల్యాణ మహోత్సవం జరగనుంది. రాత్రి 12 గంటలకు మహాభిషేకం లింగోద్భవం, ప్రత్యేక పూజలు చండీ వాహనం కాలరాత్రి పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
కాజీపేట మెట్టుగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. శ్రీరాముడు వనవాసంలో స్వయంగా ప్రతిష్టించిన లింగం కావడంతో .. ఇక్కడ స్వామికి పూజలు చేస్తే కష్టాలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇదీ చదవండి: శివోహం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు