జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిడతల దండు దాడి చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. మిడతల దండు దాడి పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో గురువారం కలెక్టర్ మహదేవపూర్ మండలంలోని మెట్పల్లిలో పర్యటించి గ్రామ ప్రజలతో మాట్లాడారు. వారికి మిడతల దండు దాడి గురించి అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.
మిడతలు ఆదిలాబాద్ దిశగా వస్తున్నట్లు సమాచారం తెలుస్తుందని.. గాలివాటం దక్షిణం వైపు వీస్తే.. ఐదారు రోజుల్లో భూపాలపల్లి వచ్చే అవకాశముందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలుగా అధికారులను, సర్పంచులను, అప్రమత్తం చేసి దాడిని ఎదుర్కొనేందుకు రసాయనాల పిచికారీలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మిడతల దాడిలో పంటలు, వృక్ష సంపదకు నష్టం వాటిల్లకుండా రాత్రుళ్లు గస్తీ నిర్వహించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇవీ చూడండి: గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్ విజృంభణ!