కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్ హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు 82 పంపులు ఏర్పాటు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు ఎగువన పంప్ హౌస్‌లను నిర్మించారు. వీటితో పాటు ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నుంచి మధ్యమానేరు మధ్యలో ఆరు, ఎనిమిది ప్యాకేజీల్లో భారీ పంప్ హౌస్‌లు ఏర్పాటు చేశారు. మొదటి లింక్‌లోని ఈ మూడు పంప్ హౌస్‌లతో మొత్తం 1720 మెగావాట్ల విద్యుత్ వినియోగం కానుంది. ఆరో ప్యాకేజీలో భారీ పంపులను వినియోగిస్తున్నారు. ఏకంగా 124 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు పంపులను వాడనున్నారు. ఇక్కడ భూగర్భంలో అతిపెద్ద సర్జ్ పూల్‌ను నిర్మించారు. భూగర్భంలోనే గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని కూడా నిర్మించారు.
330 మీటర్ల దిగువన
ఎనిమిదో ప్యాకేజీలో అతిపెద్ద భూగర్భ పంప్ హౌస్‌ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల పంపింగ్ స్టేషన్. భూగర్భంలో 330 మీటర్ల దిగువన నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసే పంపుల సామర్థ్యం ఏకంగా 139 మెగావాట్లు అంటే ఆశ్చర్యం కలగక మానదు. భారీ సామర్థ్యం ఉన్న ఏడు పంపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంత భారీ స్థాయి పంపులను ప్రపంచంలో ఎక్కడా వినియోగించలేదు. ఈ పంపులకు 973 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది.
బీహెచ్ఈఎల్ సహకారంతో
ఈ పంపులన్నీ స్వదేశీ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ సహకారంతో సిద్ధం చేశారు. పంపుల పరీక్ష ఇప్పటికే పూర్తైంది. నీటిని ఎత్తిపోసే వెట్ రన్ జరగాల్సి ఉంది. ఈ పంపులు ఏకంగా 115 మీటర్ల ఎగువకు నీటిని ఎత్తిపోస్తాయి. 11వ ప్యాకేజీలో 135 మెగావాట్లు, 4,10 ప్యాకేజీలలో 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు పంపులను వినియోగించనున్నారు.
2,890 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు మొత్తం 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఇప్పటికే ఆరు 400 కె.వి సబ్ స్టేషన్లు, తొమ్మిది 220 కె.వి సబ్ స్టేషన్లు, రెండు 132 కె.వి సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 521.08 కి.మీల 400 కె.వి లైన్ , 461.05కి.మీల 220 కె.వి లైన్, 43.2కి.మీ 132 కె.వి లైన్లను ఏర్పాటు చేశారు. ఈ విధంగా 1025.3 కి.మీ లైన్ వేశారు. ఇందుకు రూ.2,890 కోట్లు వెచ్చించారు.
ఇవీ చూడండి: రేపే వైభవంగా కాళేశ్వరం ప్రారంభోత్సవం