పల్లెలకు వన్నె తెచ్చేలా ప్రతి గ్రామాల్లో ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. మొగుళ్లపల్లిలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి హరితహారం ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్, మండల రిసోర్స్ సెంటర్లలో మొక్కలు నాటారు.
రాష్ట్రాన్ని వృక్ష సంపదతో నింపి హరిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ పిలుపుమేరకు జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు హరితహారం కార్యక్రమాన్నీ హరితజయ పేరుతో జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 61 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా... ఆ దిశగా వివిధ శాఖల ద్వారా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.