కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత పేర్కొన్నారు. భక్తుల వసతి కల్పన కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు.. వేగంగా ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్‌లో ఆలయ ఈఓ, సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.
పనులు వేగంగా ముందుకు సాగకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. వెంటనే ఆయా ఇంజినీరింగ్ అధికారులు వారి వారి శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణాల పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మారుతి, పంచాయతీరాజ్ ఈఈ రాంబాబు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంఏ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రోడ్డు విస్తరణ కోసం కదిలిన అఖిలపక్షం.. కార్యాచరణ సిద్ధం