కరోనా వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు కాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అధికంగా నమోదవుతున్న భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేసి కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కరోనా నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు.
అదేవిధంగా మహాముత్తారం, కాటారం పీహెచ్సీలలో ఇస్తున్న విధంగానే జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చే గర్భిణీలు, బాలింతలకు మధ్యాహ్నం భోజనం అందించాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు, వ్యాధిగ్రస్తులు, పేదవారికి నిర్దేశిత రోజుల్లో 5 రూపాయలకే ఒకపూట భోజనం పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధార్ సింగ్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రవి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ మమత, డాక్టర్ జైపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : భట్టి విక్రమార్క